Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2025, 5:43 pm Posted by : ramakrishna

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం

  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా ఇవ్వాలి
  • కేవియట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే ప్రభుత్వంపై ఉద్యమిస్తాం
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు 25 వేల మంది బీసీ బిడ్డలకు రాజకీయ పదవులు దక్కితే అందులో సగం పదవులు ఆడబిడ్డలకే వస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఇప్పటి వరకు రాజకీయంగా ఎలాంటి అవకాశం దక్కని కులాలకు రాజకీయ రిజర్వేషన్ల ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమూ అందులో సబ్ కోటా కల్పించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని.. అది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కేబినెట్ చేసిన సవరణ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని, దానికి వెంటనే ఆమోదముద్ర వేసి గెజిట్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు అడ్డు తగిలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికి అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్రం పరిధిలో ఉంటే.. ఉన్న రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవియెట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతమన్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేధిస్తోందన్నారు. పెండింగ్ లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Telangana Jagruti struggle until 25 thousand BCs become public representatives