Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 3:18 pm Posted by : ramakrishna

తెలంగాణ ధాన్యానికి మంచి పేరుంది

కామారెడ్డి, బతుకమ్మ: తెలంగాణలో పండించే ధాన్యానికి మన దేశంలోని వివిధ రాష్ర్టాలతోపాటు విదేశాల్లో మంచి పేరుందని సివిల్ సప్లై శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డీఎస్ చౌహాన్ అన్నారు. కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిల్లర్లు గతంలో ఇచ్చిన సీఎంఆర్ ఆధారంగా ధాన్యం కేటాయిస్తున్నామని, ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని మిల్లర్లకు సూచించారు. ఆరబోసిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, పూర్తిస్థాయిలో కోతకు వచ్చిన తరువాతే పంటను కోయాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో కాంటా అయిన మూడునాలుగు రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 423 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ సంగ్వాన్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 51,480 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రాష్ర్టంలో రెండోస్థానంలో నిలిచామని తెలిపారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ చెక్ పోస్టులు ఏర్పాటుచేసి ఇతర రాష్ర్టాల ధాన్యం రాకుండా నిఘా సారించామన్నారు. అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్ రావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్ చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహారావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, రైస్ మిల్లర్లు, ఆయా కేంద్రాల ఇన్ చార్జీలు, రైతులు పాల్గొన్నారు.

Telangana grain has a good reputation