. . . 4.21 లక్షల మందికి గ్రూప్ ప్రమాద బీమా
. . . క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, సామాజిక భద్రతకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (జీఏఐఎస్) అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురయ్యే మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో గ్రూప్ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2026-27 సంవత్సరంలో 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల 4,21,767 మంది నమోదిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారని మంత్రి వెల్లడించారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.79.96 చొప్పున బీమా ప్రీమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియం భరిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లించనుందని వివరించారు. దీంతో అర్హులైన మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. ఈ గ్రూప్ ప్రమాద బీమా పథకం కింద ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు బీమా పరిహారం అందుతుంది. శాశ్వత సంపూర్ణ వైకల్యానికి కూడా రూ.5 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది. అలాగే ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందిన సందర్భంలో గరిష్ఠంగా రూ.25 వేల వరకు వైద్య సహాయం అందించనున్నారు. 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీ కాలంలో అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రమాద సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు, వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో గ్రూప్ ప్రమాద బీమా పథకం కీలకమైనదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదిత మత్స్యకారులు, వారి కుటుంబాలకు సమగ్ర సామాజిక భద్రత, ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వాకిటి శ్రీహరి తెలిపారు.