- సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది
- రాష్ట్ర సాధన పేరుతో కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకం
- దీక్షా దీవాస్ పేరుతో కోట్లు ఖర్చు చేసి ప్రచారం
- పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ : కేసీఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని ఆనాడు అమరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో డీసీసీ , సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ల పదవి స్వీకర కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని అన్నారు. ఆనాటి దీక్షను సొమ్ము చేసుకునేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో దీక్షా దీవాస్ పేరుతో నాటకాన్ని రక్తికట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాకపోతే కేటీఆర్, హరీష్ రావు, కవితలకు పదవులు దక్కేవా అని అన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసిన వారి హయంలో ఏం అభివ`ద్ది జరిగిందని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తే బీఆర్ ఎస్, బీజేపీలు అడ్డుకున్నాయని, అందువల్లనే బీజేపీకి జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ దక్కలేదని ఎద్దేవా చేశారు. జిల్లా డెవలప్ మెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని, ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలతో పాటు వ్యవసాయ కళాశాల మంజూరు చేశారని గుర్తు చేశారు. రహత్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 11 ఎకరాలను దానం చేశానని తెలిపారు. గత పది సంవత్సరాల కాంగ్రెస్ కష్టకాలంలోనూ జిల్లా అధ్యక్షుడిగా మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులుగా కేశ వేణులు పార్టీకి అండగా నిలబడి క్యాడర్ ను కాపాడరని గుర్తు చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆకుల లలితతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, అన్వేష్ రెడ్డి, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, అంతిరెడ్డి రాజారెడ్డిలు పాల్గొన్నారు.

- ప్రమాణస్వీకారం చేసిన నగేష్ రెడ్డి, రామకృష్ణ..
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాటిపల్లినగేష్ రెడ్డి, నగర అధ్యక్షులుగా బొబ్బిలి రామకృష్ణలు ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తమకు పదవులు కేటాయించారని, ఎన్నికల్లో గెలిచి పార్టీకి గిఫ్ట్ గా ఇస్తామని వారు పేర్కొన్నారు.
