Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 7:56 pm Posted by : ramakrishna

ఇకపై పేపర్‌లెస్ విధానంలో తెలంగాణ మంత్రిమండలి సమావేశాలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలను ఇకపై పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రిమండలి సమావేశాలను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం “తెలంగాణ డిజిటల్ కేబినెట్” విధానాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశారు. సమావేశంలో డిజిటల్ కేబినెట్ విధానం, ట్యాబ్‌ల ద్వారా మంత్రివర్గ సమావేశాల నిర్వహణ ప్రక్రియను ప్రదర్శించి పరిశీలించారు. ఇకపై మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన ఎజెండా, నోట్స్, ఇతర ముఖ్యమైన పత్రాలు అన్నీ ఈ-బుక్ రూపంలోనే మంత్రులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచడంతో పాటు, కాగిత వినియోగాన్ని తగ్గించి వేగవంతమైన, పారదర్శకమైన పాలనకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

 

Telangana Cabinet meetings to be paperless henceforth.