నిజామాబాద్, బతుకమ్మ: పరీక్షల సమీపిస్తున్న నేపథ్యంలో పదో తరగతిలో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్ లతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా వారిని సన్నద్ధం చేయాలని, ప్రణాళికాబద్ధంగా బోధించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. అన్నం, కూరలతో పాటు పాఠశాలలకు కేటాయించిన బియ్యం నిల్వలు, కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. భీమ్ గల్ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసిన దుప్పట్లు, కాస్మొటిక్ కిట్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని ఇతర సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కూడా వీటి పంపిణీ జరిగిందా అని ఆరా తీశారు. తరగతి గదులకు వెళ్లి బోధనా తీరును పరిశీలించిన కలెక్టర్, బాలబాలికలకు పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు.
పోలింగ్ కేంద్రాల్లో వసతుల పరిశీలన
నిజామాబాద్ – కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ ఉమ్మడి జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని భీమ్ గల్, వేల్పూర్, పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్లలో లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు.
