- 25 రోజులుగా ఉపాధ్యాయుల నిరసన
- ఇంటి బాట పడుతున్న విద్యార్థులు
- ప్రభుత్వ ఉపాధ్యాయులకు కస్తూర్బా డ్యూటీలు.
- గెస్ట్ టీచర్లకు నైట్ డ్యూటీలు
బతుకమ్మ, బోధన్ : కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి, మినిమం టైమ్స్ స్కేల్ అమలు చేయాలని సుమారు 25 రోజుల నుండి కస్తూర్బా గాంధీ స్కూల్స్ టీచర్లు నిరసన కార్యక్రమాలు చేస్తుండడంతో కేజీబీవీ స్కూళ్లలో విద్యా బోధన నిలిచిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా కేజీబీవీ స్కూళ్లలో చాలీచాలని జీతంతో డే , నైట్ డ్యూటీస్, హాలిడే, సండే డ్యూటీస్ లాంటి అన్ని రకాల డ్యూటీలు చేస్తూ డ్రాప్ ఔట్ విద్యార్థినిలను తీర్చిదిద్దుతూ మిగతా ప్రభుత్వ పాఠశాల కన్న మెరుగైన ఫలితాలు సాధిస్తున్న తమకు ప్రభుత్వం మినిమం టైం స్కేల్ తో పాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ కేజీబీవీ టీచర్స్ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో కలిసి సుమారు 25 రోజుల నుండి ఒకవైపు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేస్తూ మరోవైపు పి.ఈ.టి లేక ఒక సి.ఆర్.టి. స్కూల్లో ఉండి పిల్లలను చూసుకుంటున్నారు.
10 వ తరగతి చదువుల పై ప్రభావం..
ఉపాధ్యాయులు లేకపోవడంతో సిలబస్ పై తీవ్రప్రభావం పడుతుంది. సుమారు నెల రోజులుగా బోధన నిలిచిపోవడంతో విద్యార్ధులపై తీవ్ర ప్రభావం పడుతుందని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. టీచర్లు లేక పాఠాల బోధన లేకపోవడంతో విద్యార్థులు స్టడీ అవర్స్ కు మాత్రమే పరిమితం అవుతున్నారు. పదవ తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతున్న ఈ సమయంలో ఉపాధ్యాయులు సమ్మె చేస్తుండడంతో వచ్చే పదవ తరగతి వార్షిక ఫలితాలపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పదవతరగతి సిలబస్ పూర్తిచేసి పున:శ్చరణ, ప్రత్యేక తరగతులు నిర్వహించే ఈ సమయంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమంలో ఉండడంతో తమ 10 వ తరగతి విద్యార్థులు భవిష్యత్తు ఏమిటని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. పదవ తరగతి పరీక్ష తేదీలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు, ప్రభుత్వం తమ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇంటిదారి పడుతున్న విద్యార్థినిలు..
కేజీబీవీ టీచర్లు నిరసనలో పాల్గొనడంతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. తరగతులు నిర్వహించకపోవడం, ఉపాధ్యాయులు రాకపోవడంతో తల్లితండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళుతున్నారు. పలు కస్తూర్బా గాంధీ విద్యాలయలలో విద్యార్థినిలు అనారోగ్యం, ఇతర కారణాలు చెబుతూ ఇంటికి వెళ్ళిపోతున్నారని, మొత్తం విద్యార్థినిలలో సగం వరకే ఉంటున్నారని సమాచారం.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంచార్జిలు..
ఒకవైపు కేజీబీవీలలో బోధన కు ఆటంకం కలగకుండా విద్యాశాఖ చర్యలు చేపడుతుంది. కేజీబీవీ లలో ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు ఇంటర్ నెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. టెంపరరీ టీచర్స్ లను నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికిని విద్యార్థులు తమ ఉపాధ్యాయులు మాత్రమే కావాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను కేజీబీవీ లకు ఇన్చార్జిలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికిని ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం ఆసక్తి చూపించడం లేదని సమాచారం. వీటితో పాటు ఈమధ్యనే అపాయింట్మెంట్ చేసిన గెస్ట్ టీచర్లకు నైట్ డ్యూటీ లు వేస్తూ ఉత్తర్వులు చేయడం విశేషం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించి కస్తూర్బా పాఠశాలలో బోధనను కొనసాగించాలని కోరుతున్నారు.