Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2024, 4:31 pm Posted by : ramakrishna

మండలిలో ఉపాధ్యాయుల గొంతునవుతా

. పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : రెండు దశాబ్దాలకు పైగా  ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు విద్య బోధన చేశానని,  పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి  కృషిచేశానని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో ఉపాధ్యాయుల గొంతుకనవుతానని పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లోని పీఆర్టీయూ భవన్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలోని మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన తాను 22 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో సేవ చేశానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వీఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 500 స్కూళ్లలో సేవలందిస్తున్నానని అన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పాటుపడ్డానని అన్నారు. 12 ఏళ్లుగా పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారానికి పాటుపడ్డానని అన్నారు. 2022లో ఉపాధ్యాయ పదవికి వీఆర్ఎస్ తీసుకొని ఎమ్మెల్సీగా పోటీకి సిద్ధపడ్డానని అన్నారు. ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి శాసనమండలి వేదిక చేసుకుని పాటుపడతానని అన్నారు. తనకు అవకాశం ఇప్పించి ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం, 317 జీవో బాధితుల పక్షాన, సీపీఎస్ రద్దు కోసం పాటుపడతానని అన్నారు.  సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొద్దుటూరు మోహన్ రెడ్డి, కిషన్ తోపాటు రాష్ట్ర అసోసియేట్ నాయకులు రచ్చ మురళి, హైదరాబాద్ పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.