Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:08 pm Posted by : ramakrishna

ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

 

బాల్కొండ, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం బాల్కొండ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బాల్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, అనంతరం వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఈ నెల 21న జిల్లా కేంద్రంలో ధర్నా, 29న రాష్ట్ర రాజధానిలో వేలాది మంది ఉపాధ్యాయులతో భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఓ. రమేష్, ఓడ్నాల శ్రీనివాస్, బోయిడ నరసయ్య, కే. చంద్రశేఖర్, పబ్బ శంకర్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.