. . . చిన్నారులను అభినందించిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల క్రీడా పోటీల్లో నిజామాబాద్ జిల్లాలోని భవిత కేంద్రాలకు చెందిన చిన్నారులు ప్రతిభ చాటారు. గురువారం వారు కలెక్టరేట్ లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని ఆమె ఛాంబర్ లో కలిసి, రాష్ట్ర స్థాయి పోటీలలో సాధించిన మెడల్స్, బహుమతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులను పేరుపేరున అభినందిస్తూ, వారితో ఫోటో సెషన్ లో పాల్గొన్నారు.

భవిత కేంద్రాల విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు తీర్చిదిద్దిన ఐ.ఆర్.పీలు, ఇతర అధికారులను కూడా అభినందించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. సాధారణ విద్యార్థులకు సమానంగా భవిత కేంద్రాలలో ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు, ప్రోత్సాహం అందించబడతాయని అన్నారు. విద్యార్థులను అభినందించిన వారిలో డీఈఓ అశోక్ తదితరులు ఉన్నారు.
