. ఆర్వోబీ నిర్మాణాల్లో వేగం పెంచడంతోపాటు బిల్లులు మంజూరు చేయండి
. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కోరిన ఎంపి అర్వింద్
. త్వరలో కాజిపేట్ – దాదర్ రైలు ప్రారంభిస్తామన్న మంత్రి
నిజామాబాద్, బతుకమ్మ : దేశ రాజధాని ఢిల్లీకి నిజామాబాద్ మీదుగా రైలు నడుపాలని, పార్లమెంట్ పరిధి మీదుగా తిరుపతి, ముంబై లకు కొత్త రైళ్లను వేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎంపీ అర్వింద్ కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న ఆర్వోబీల నిర్మాణాలను వేగవంతం చేసేలా అధికారులకు సూచనలు జారీ చేయాలని కోరారు. పార్లమెంట్ పరిధిలో రైల్వేలకి సంబంధించి, పెండింగ్ లో ఉన్న పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారానికి ఒకసారి నడిచే కాజీపేట్ – దాదర్ రైలుని వారానికి మూడుసార్లు నడిచేలా చేయాలని ఎంపీ కోరగా, త్వరలోనే తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో అవసరమైన చోట్ల కొత్త ఆర్ఓబీలు, ఆర్ యూబీల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని , అంతేకాకుండా గత రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం కారణంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆర్మూర్ – ఆదిలాబాద్ మరియు బోధన్ -బీదర్ రైల్వే లైన్ల మంజూరు చర్యలను వేగవంతం చేయాలని ఎంపీ అర్వింద్ కోరారు. అమృత్ భారత్ కింద 53 కోట్లతో చేపడుతున్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు.ఇవే కాకుండా పార్లమెంట్ పరిధిలో రైల్వేల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ పేర్కొన్నారు.తాను చేసిన విజ్ఞప్తుల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించి, తగు చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టు మంత్రి వివరించారని, ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎంపీ అర్వింద్ అన్నారు.