Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 10:41 pm Posted by : ramakrishna

సీఎంఆర్ రికవరీ బాధ్యతలు తహసీల్ధార్లకు

  • రెవెన్యూ రికవరి యాక్టు అమలుకు ఆదేశాల
  • ఉమ్మడి జిల్లాలో రూ.299 కోట్లు సీఎంఆర్ బకాయిలు రికవరీ అయ్యేనా..?
  • పోలీసులు కేసుల విచారణ దుమ్ము దులిపేనా..?

 

నిజామాబాద్, బతుకమ్మ : సీ.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్ లను ఆదేశించారు. శుక్రవారం తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలు,వారి నుండి రావాల్సిన మొత్తం ఎంత, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు తదితర వివరాలను ఒక్కో డిఫాల్ట్ రైస్ మిల్ వారీగా సంబంధిత మండల తహసీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. డిఫాల్ట్ రైస్ మిల్లులతో పాటు,మిల్లర్లకు చెందిన ఆస్తులను బ్లాక్ చేయించాలని,అవసరమైతే ఆస్తులను  వేలం వేసి సీఎంఆర్ నిధులను రాబట్టే దిశగా చర్యకు తీసుకోవాలని కలెక్టర్ కరాఖండిగా తేల్చి చెప్పారు. సీ.ఎం.ఆర్ నిధులు పూర్తి స్థాయిలో రికవరీ కావాల్సిందేనని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇకనుండి తాను సీఎంఆర్ రికవరీపై ప్రతీ వారం సమీక్ష జరుపుతానని కలెక్టర్ తేల్చి చెప్పారు.

  • ఉమ్మడి జిల్లాలో రూ.295 కోట్ల సీఎంఆర్ బకాయిలు..

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వాలు మారుతున్నాయి.. అధికారులు మారుతున్నారు.. కానీ సీఎంఆర్ బకాయిలు మాత్రం రికవరి కావడం లేదు. ప్రతిపక్షాలు సీఎంఆర్ కుంభకోణం జరిగిందని ఏకంగా కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ రికవరి చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ 18 నెలలు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. మంత్రులు స్వయంగా సమీక్షలు నిర్వహించినా రికవరి జరిగింది శూన్యం. నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ బియ్యం పక్కదారిపై పోలీసు కేసులు నమోదు అయినా విచారణ అటకెక్కింది. గత ప్రభుత్వ హయంలో జరిగిన కుంభకోణంపై ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తిపోశాయి. కానీ ప్రభుత్వం మారినా మిల్లర్ల వద్ద నుంచి రికవరికి చొరవ చూపలేదు. నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ వడ్ల మార్పిడి వ్యవహరంలో డీఎస్ వో, డీఎంవోల ను సస్పెండ్ చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మిల్లర్లు మాత్రం దర్జాగా వడ్లను బియ్యంగా మార్చుకుని అమ్మేసుకున్నారు. రెవెన్యూ రికవరి యాక్టు గురించి మూడు సంవత్సరాలుగా చెబుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-23 సంవత్సరాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 44 మిల్లుల నుంచి రూ.250 కోట్ల సీఎంఆర్ రావాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో 49 మిల్లుల నుంచి 45 కోట్ల విలువ చేసే సీఎంఆర్ రికవరి చేయాల్సి ఉంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నుంచి దాదాపు రూ.60 కోట్ల మేర సీఎంఆర్ బకాయిలు ఉండడం విశేషం. సీఎంఆర్ బకాయిలు దశాబ్ధ కాలంగా పెండింగ్ లో ఉన్న నోటీసులతోనే సరిపెడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ వ్యవహరంలో మిల్లర్లు, అధికారులు, అధికార పార్టీ నేతలు మిలాఖత్ అయి వడ్లను నూర్పిడి చేయకుండానే బహిరంగ మార్కెట్లో అమ్మేసుకున్నవ్యవహరం  వెలుగు చూసిన చర్యలు మాత్రం శూన్యం. 2021-22 యాసంగి సీజన్ లో 2022-23 వానాకాలం సీజన్ లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన రాహిల్, రాస్, అమీర్, దాన్విక్ మిల్లులకు ఆనాటి ప్రభుత్వం రూ.50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించింది. ధాన్యాన్ని కోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్న ఒక్క గింజ ధాన్యం కూడా మిల్లింగ్ చేయలేదని గుర్తించారు. ఇప్పటి వరకు 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అంటగట్టారు. మిగిలిన పది వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 మిల్లులకు ధాన్యాన్ని ఇచ్చినట్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారుల ద్వారా లేఖలు ఇప్పించారు. రూ.60 కోట్ల ధాన్యం తాలుకు సీఎంఆర్ ను మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన మిల్లుల నుంచి రికవరి కాకపోవడంతో ప్రభుత్వం రూ.10 కోట్ల జరిమానా విధించింది. కానీ ఒక్క రూపాయి జరిమానా కూడా చెల్లించకపోవడం విశేషం.

సీఎంఆర్ రికవరికి ముందే కేటాయింపులోనే అధికారులు మిల్లర్లతో కుమ్మకయ్యారని ఆరోపణలున్నాయి. గతంలో డీఎస్ వోగా పని చేసిన వ్యక్తి జిల్లా కేంద్రంలోని హోటళ్ళలో మిల్లర్లతో సిట్టింగ్ లు ఏర్పాటు చేసి వాటాలు వసూల్  చేసిన తర్వాతనే కేటాయింపులు జరిపారనేది బహిరంగ రహస్యం. ఈ వ్యవహరంలో ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అయితే సీఎంఆర్ వ్యవహరంలో ఫోర్జరీ సంతకాల విషయంలో అప్పటి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ డీఎస్ వో చంద్రప్రకాష్, డిప్యూటీ తహసీల్ధార్ నిఖిల్ రాజ్ లపై వర్ని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోటగిరి పోలీస్ స్టేషన్ లో సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారని మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదైంది. సంబంధిత రెండు కేసులను జిల్లా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా జిల్లా కలెక్టర్లు, తహసీల్ధార్ల ద్వారా రెవెన్యూ రికవరి యాక్టు ప్రయోగించాలని ఆదేశాలు జారీ చేయడంతో సీఎంఆర్ రికవరి వ్యవహరం మరోసారి తెరపైకి వచ్చింది. రికవరి జరుగుతుందా? బాధ్యులపై చర్యలు ఉంటాయన్నది వేచి చూడాల్సిందే.