-పాల్గొన్న రాష్ట్ర కార్పొరేషన్ ల చైర్మన్లు
ఆర్మూర్ , బతుకమ్మ:
దసరా పండుగ సందర్భంగా విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ దసరా కిసాన్ సమ్మేళనవ ను ఏర్పాటు చేయడంతో అన్ని పార్టీల నాయకులతో పాటు రెండు నియోజకవర్గాలలోని రైతులతో ఆత్మీయంగా కలిసినట్లు మినరల్ డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ ఈరవత్రి అనిల్, సహకార సంఘాల అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ మాడాల మోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్ట వెనుక గల విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం కిసాన్ మిలాప్ రైతుల కలయిక కార్యక్రమాన్ని విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్మూర్ బాల్కొండ జక్రాన్ పల్లి మండలాల రైతులను, వివిధ పార్టీల నాయకులను పార్టీలకతీతంగా ఈ మిలాప్ లో ఆహ్వానించారు. ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ గతంలో దసరా పండుగంటే 20 రోజుల ముందు నుంచి కుటుంబ సభ్యులతో పాటు పిల్లల్లో ఉత్సాహం ఉండేది అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దసరా పండుగ సందర్భంగా అందరూ ఒకచోట కలవలేక పోతున్నారన్నారు. గ్రామాలలోని అనేకమంది రైతు కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు తరలి వెళ్లడం వలన ఇంట్లో దసరా పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని అన్నారు. అన్వేష్ రెడ్డి చొరవ తీసుకొని రెండు నియోజకవర్గాలలోని రైతులను పార్టీలకతీతంగా ఒకే దగ్గరికి చేర్చడం అభినందనీయమన్నారు. ఈ ప్రక్రియ రాబోయే రోజుల్లో సైతం అన్వేష్ రెడ్డి ముందుండి నడిపించాలని దీనికి తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. రైతులందరూ ఒకే దగ్గర ఆత్మీయంగా కలిసి ఒకరినొకరు అలాయ్-, బలాయ్ చేసుకోవడం, పలకరించుకోవడం ఆనందంగా ఉందన్నారు.విత్తన అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ కిసాన్ మిలాప్ ను పార్టీలకతీతంగా రైతులతో పాటు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించి ఒకే వేదికపై తీసుకురావడం జరిగిందన్నారు. మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మిలాప్ లో అందరు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. అందరి సహకారంతో వచ్చే ఏడాది ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. పండుగ కళ తగ్గుతున్న వేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తిరిగి దసరా పండుగ శోభను తీసుకురావడం జరిగిందన్నారు. కోకిల నాగరాజు బృందం పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ బృందం పాడిన పాటలపై రైతులతోపాటు నాయకులు నృత్యాలు చేశారు. మిలాప్ లో హాజరైన నాయకులు, రైతులు కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ అన్వేష్ రెడ్డి ఏర్పాటు చేసిన భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు పొద్దుటూరి, సునీల్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వి. ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు బి దేవరాం, టిడిపి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు దేగాం యాద గౌడ్, ఐసిడిఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, ఐ ఎఫ్ టు యు జిల్లా అధ్యక్షుడు ముత్తన్న, రైతు కూలి సంఘం ఏరియా అధ్యక్ష కార్యదర్శులు యు రాజన్న, గంగారాం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఆలూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, రెండు నియోజకవర్గాలలోని మాజీ సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.