Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 8:14 pm Posted by : ramakrishna

తెలంగాణ ఉద్యమకారులకు తీపి కబురు

 

. . . మంత్రి పొన్నంతో ప్రత్యేక కమిటి బేటి

 

. . . త్వరలో జిల్లాల వారిగా సర్వేలు, అధ్యయనం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక అడుగు పడింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ లు ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ అద్దంకి దయాకర్ మినిస్టర్ క్వార్టర్స్‌ లో భేటీ అయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే అంశంపై మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన ప్రాథమిక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి, హామీల అమలుకు ఒక సమర్థవంతమైన కమిటీని ఏర్పాటు చేయడంపై ప్రాథమికంగా చర్చించారు. ఈ కమిటీలో మహిళలకు, వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో అసలైన ఉద్యమకారులను గుర్తించేందుకు జిల్లా వారీగా సర్వే నిర్వహించాలని, వారి డిమాండ్లపై సమగ్ర అధ్యయనం చేయాలని నేతలు భావించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అర్హత ప్రమాణాలు, విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు వెలకట్టలేనివని, వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే పారదర్శకమైన విధానంతో అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు. వచ్చే వారం మరోసారి సమావేశమై కమిటీ సభ్యుల ఎంపిక అమలు ప్రణాళికపై స్పష్టతనివ్వాలని నేతలు నిర్ణయించారు. ఈ సమావేశం ఉద్యమకారుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.