నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ పోలీస్ కస్టడిలో ఉన్న పెద్దపల్లి జిల్లా యువకుడు ఆనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన ఆలకుంట సంపత్ (32) జగిత్యాల జిల్లా కేంద్రం లో శ్రీరామ ఇంటర్ నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కొందరు గల్ఫ్ దేశాలకు వెళ్లగా అక్కడ మోస పోయామని నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు ఈ నెల 4న గల్ఫ్ ఏజెంట్ గా వ్యవహరించిన సంపత్, అతని తోడల్లుడిని అదుపులోకి తీసుకుని విచారించి రిమాండ్ కు పంపారు. ఇటీవల సంపత్ ను విచారించేందుకు కోర్టు అనుమతితో పోలీస్ కస్టడికి ఈ నెల 12న తీసుకున్నారు. ఈ నెల 13న జగిత్యాల జిల్లాకు తీసుకువెళ్లి తిరుగు ప్రయాణంలో రాత్రి 9.50 నిమిషాల ప్రాంతంలో సంపత్ చెతినొప్పిగా ఉందని తెలుపగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు సంపత్ కుటుంబీకులకు రాత్రి 12 గంటల ప్రాంతంలో సమాచారం అందించగా శుక్రవారం ఉదయం జిల్లా ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. గురువారం సంపత్ ను తమ కస్టడిలోకి తీసుకుని విచారణ సమయంలో పొలీసులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించి అందోళనకు దిగారు. సంపత్ కు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. పోలీసులు విచారణ పేరిట సంపత్ ను కొట్టిన దెబ్బలకు తాళలేక చనిపోయాడని న్యాయం చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.
- కస్టోడియల్ డేత్ లో మిస్టరీ లేదు.. హార్ట్ ఎటాక్ తో చనిపోయారు..
గల్ప్ భాధితులను మోసం చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న ఆలకుంట సంపత్ ను కోర్టు అనుమతితో కస్టడిలోకి తీసుకున్నామని అతడి మరణంలో ఎలాంటి వేదింపులు, ఇంటరాగేషన్ జరుపలేదని అతడు గుండెపోటుతో చనిపోయాడని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు. జగిత్యాలలో నిందితుడు సంపత్ దాచిన సెల్ ఫోన్ లను రీకవరి చేసి పోలీసులు తీరుగు ప్రయాణంలో సంపత్ కు చేతి నొప్పితో విలవిల్లాడగా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. సంపత్ నడుచుకుంటు వచ్చిన వీడియో పుటేజీలు ఉన్నాయని, సంపత్ మరణంపై ఫోరెన్సిక్ వైద్యుల సమక్షంలో నిర్వహించిన పోస్టు మార్టం నివేదికలో స్ట్రోక్ గా నిర్థారించడం జరిగిందన్నారు.
- కస్టోడియల్ డెత్ పై పోలీసు కేసు.. మెజిస్ట్రేట్ తో న్యాయ విచారణ….
పోలీస్ కస్టడికి తీసుకున్న ఆలకుంట సంపత్ మరణంపై స్థానిక ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మరణంపై మానవ హక్కుల కమీషన్ కు సమాచారం అందించారు అధికారులు. సంపత్ మరణంపై ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఆసుపత్రిలోని పోస్టు మార్టం గది వద్ద విచారణ జరిపినట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు.