- పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
రుద్రూర్, బతుకమ్మ : భర్త పై అనుమానంతో మృతదేహాన్ని పూడికతీత సంఘటన రుద్రూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలంలోని ఆర్ఎన్సీ కాలనీకి చెందిన మేతరి సాయిలు (ట్రాక్టర్ డ్రైవర్) అను వ్యక్తి రెండు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గత పది రోజుల కిందట మృతి చెందాడు. మృతుడు సాయిలు మొదటి భార్య శోభ మరణించగా, కోటగిరి గ్రామానికి చెందిన రెండవ భార్య బొర్ర సాయవ్వతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. తన భర్త సాయిలు మృతి చెంది అంత్యక్రియలు చేసిన విషయం తనకు సమాచారం ఇవ్వలేదని, తన భర్త మృతిపై గైని పెద్ద సాయిలు, గైని శివలీల, గైని పోచమ్మల పై అనుమానం ఉందని రెండవ భార్య బొర్ర సాయవ్వ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్సై పేర్కొన్నారు. మృతుడు సాయిలు రెండవ భార్య బొర్ర సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మంగళవారం మృతుడు సాయిలు మృత దేహాన్ని పూడిక తీయించి తహశీల్దార్ తారాబాయి, డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి, నిజామాబాద్ ఫోరెన్సిక్ వారికి పంపడం జరిగిందని ఎస్సై సాయన్న వెల్లడించారు.