Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 7:42 pm Posted by : ramakrishna

దుబ్బాక జెడ్పీ హైస్కూల్ హెచ్.ఎం సస్పెన్షన్

 

ధర్పల్లి, బతుకమ్మ :

 

ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (గెజిటెడ్ హెచ్.ఎం) ఎ.శశికళను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడంతో పాటు, ఎలాంటి అనుమతులు లేకుండానే పాఠశాల సామాగ్రిని విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఈ ఉదంతంపై ప్రాథమిక విచారణ జరిపించారు. ఈ సందర్భంగా పాఠశాల విధులకు హాజరుకాకుండానే హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసినట్లు, సంబంధిత అధికారుల నుండి కానీ, పాఠశాల నిర్వహణ కమిటీ నుండి (ఎస్ఎంసీ) ఎలాంటి అనుమతి లేకుండానే పాఠశాలలోని జనరేటర్, ఫర్నిచర్‌ను విక్రయించినట్లు, ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను కూడా విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి కావడంతో హెచ్.ఎం శశికళను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.