Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 6:30 pm Posted by : ramakrishna

సస్పెండెడ్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ అరెస్ట్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

సిరిసిల్ల జిల్లాకు చెందిన సస్పెండెడ్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌ను నిజామాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. యువతి ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీకాంత్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి పోలీసుల కంట పడకుండా తిరుగుతున్న అతడిని సెల్‌ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా నిజామాబాద్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా, గతంలో తిమ్మాపూర్ ఎస్సైగా పనిచేసిన సమయంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో నిందితులకు సహకరించేందుకు భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు శ్రీకాంత్ గౌడ్‌పై ఉన్నాయి. ఈ వ్యవహారంలో సుమారు రూ.2 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ గౌడ్‌పై నమోదైన కేసులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.