Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 9:40 pm Posted by : ramakrishna

ఏసీబీ వలలో సర్వే శాఖ సూపరింటెండెంట్‌

 

. . . రూ.15 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

మహబూబ్‌నగర్, బతుకమ్మ :

 

మహబూబ్‌నగర్ జిల్లా సహాయ సంచాలకుడు (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం రూ.15 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్వేన గ్రామం, భూత్పూర్ మండలానికి సంబంధించిన గ్రామ మ్యాప్‌లో సవరణలు చేపట్టే ఫైల్‌ను సహాయ సంచాలకుడి ముందుకు పంపించి అనుకూల చర్యలు తీసుకునేందుకు ఫిర్యాదుదారుడి నుంచి సూపరింటెండెంట్ రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ మహబూబ్‌నగర్ రేంజ్ అధికారులు ఉచ్చుపన్ని, బుధవారం నిందితుడు లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.15 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విధులను నిజాయితీగా నిర్వర్తించాల్సిన బాధ్యతను విస్మరించి, అక్రమంగా ఆర్థిక లాభం పొందేందుకు లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక ఎస్పీఈ & ఏసీబీ కేసుల మొదటి అదనపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.