Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2025, 6:04 pm Posted by : ramakrishna

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు మద్దతివ్వండి

  • పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు వినతిపత్రం అందజేత

 

ఆర్మూర్, బతుకమ్మ : బోధన్‌లోని ప్రసిద్ధ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం చేపట్టిన ఉద్యమానికి మద్దతు కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగకు ఆర్మూర్ పట్టణంలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడ్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ కార్మికులు, బోధన్ యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరకు పంటకు కేంద్రబిందువుగా నిలిచిన బోధన్ ప్రాంతం, చక్కెర కర్మాగారం మూతపడిన నాటి నుంచి తీవ్రంగా దెబ్బతిన్నట్లు కార్మికులు పేర్కొన్నారు. కర్మాగార పునరుద్ధరణ అంశం పదే పదే రాజకీయ వేదికలపై హామీలుగా వినిపించినా, ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. అయితే, నూతన ప్రభుత్వం దీనిపై చర్యలు ప్రారంభించడంతో పాత బోధన్ వైభవం మళ్లీ తిరిగి వస్తుందనే నమ్మకం రైతులు, కార్మికుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్లూరి శ్రీనివాస్ నేతృత్వంలో కార్మికులు, యువత మంద కృష్ణ మాదిగను కలిసి వేతన బకాయిలు, కర్మాగార పునఃప్రారంభంపై వినతిపత్రం అందజేశారు. కార్మికుల సంక్షేమం కోసం భవిష్యత్‌లో చేపట్టబోయే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై మందకృష్ణ మాదిగ సానుకూలంగా స్పందించి, కార్మికుల పక్షాన నిలబడతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోసంగి రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాజేష్, కార్మిక సంఘ నాయకులు నాగుల రవిశంకర్ గౌడ్, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పరిశ్రమ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నా, ఈ ప్రక్రియలో ఆలస్యం వలెనే కార్మికులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని యోచిస్తున్నారు. పరిశ్రమ తిరిగి ప్రారంభమైతే బోధన్‌కు ఆర్థిక, సామాజిక రీత్యా కొత్త ఊపిరి చేకూరుతుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది.