Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 5:43 pm Posted by : ramakrishna

ప్రజోపయోగ పనులకు అనువైన స్థలాలను గుర్తించాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనుల నిర్మాణాల కోసం అనువైన భూముల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, నర్సింగ్ స్కూల్/కాలేజీలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రంథాలయాలు తదితర వాటికి సొంత భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వ అనుమతి లభించినందున, అనువైన స్థలాలను తక్షణమే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే స్థల నిర్ధారణ పూర్తయిన చోట వెంటనే పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు స్థల సమస్య కారణంగా ల్యాప్స్ కాకూడదని అన్నారు. ఆయా భవనాల నిర్మాణాల కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడైనా ఈ స్థలాలు కబ్జాకు గురైతే అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. కాగా, నిజామాబాద్ నగరం, బోధన్ వంటి పట్టణాలలో అభివృద్ధి పనులకు తగిన స్థలాలు అందుబాటులో లేకపోతే సమీప మండలాల్లో అనువైన భూములను గుర్తించాలని అన్నారు. ప్రజోపయోగ పనులకు స్థల సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, మంజూరీలు లభించిన అన్ని భవనాల నిర్మాణాల కోసం తగిన స్థలాన్ని గుర్తిస్తూ కేటాయింపులు చేయాలని తహసిల్దార్లకు స్పష్టం చేశారు. భూముల గుర్తింపు విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 

 

Suitable places for public works should be identified.
Suitable places for public works should be identified.