. . . యువకుడిపై కేసు నమోదు చేసిన కామారెడ్డి పోలీసులు
కామారెడ్డి, బతుకమ్మ :
సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఐన ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్, లైక్స్ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నట్లుగా వీడియో రూపొందించి పోస్ట్ చేసిన యువకుడిపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డాన్ రోహిత్ అనే యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భావోద్వేగ వీడియో రూపొందించి పోస్ట్ చేయడంతో విషయం గమనించిన కామారెడ్డి పట్టణ పోలీసులు వెంటనే అప్రమత్తమై అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా తాను కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆ వీడియో రూపొందించినట్లు రోహిత్ తెలిపారు. ఈ ఘటన కారణంగా పోలీసులు అత్యవసర పరిస్థితిగా భావించి వెంటనే స్పందించాల్సి రావడం వల్ల విలువైన పోలీసు సమయం, వనరులు వ్రథా అయినట్టు కామారెడ్డి ఇన్స్ పెక్టర్ నరహరి తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత చట్టాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొన్ని లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆత్మహత్య డ్రామాలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం మీ ఒక్క తప్పుడు పోస్ట్ వల్ల పోలీసే యంత్రాంగం మొత్తం అత్యవసర పరిస్థితిగా భావించి పరుగులు తీయాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి పోలీసులు విలువైన సమయం మరొకరి ప్రాణాన్ని కాపాడటానికో లేదా ఆపదలో ఉన్న బాధితులకు సాయం చేయడానికో ఉపయోగపడాలి. ఇలాంటి నిర్లక్ష్య పూరిత చర్యల వల్ల పోలీసుల సమయం వ్రథా అయితే నిజంగా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి సాయం అందడంలో ఆలస్యం జరగొచ్చు. యువత రీల్స్, సోషల్ మీడియా మోజులో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కష్టపడి చదువుకుని జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టెలా ముందుకు సాగాలని క్షణికమైన గుర్తింపు కోసం తప్పుడు దారులు పట్టవద్దని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం పనిచేసే పోలీసులు సమయాన్ని వ్రథా చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.