నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను అడిగిన వారికి అడిగినంత గతంలో ఇచ్చిన మాదిరిగా ఇవ్వాలని, ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ… తొలకరి వర్షాలు ప్రారంభమైన అందున రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు భూమి చదును చేసుకుని పంట దిగుబడి రావడానికి యూరియాను చల్లడానికి రైతులు సిద్ధమయ్యారని తెలిపారు. మసాలా బస్తాలు కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూ యూరియా కొరకు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి యాప్ లో వాటిని అర్థం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులకు యాప్ లో బుక్ చేసుకోవడానికి సరైన అవగాహన లేకపోవడంతో పాటు సకాలంలో యూరియాను పొందలేక నానా ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఈ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని గతంలో అనేకమార్లు రైతాంగం డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం యాప్ లను తొలగించకుండా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తామని ప్రకటించటం సరైన పద్ధతి కాదని అన్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం సకాలంలో పంపకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకుండా రైతులు ఇబ్బందులకు గురి చేయడం వలన సాధారణ మధ్యతరగతి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులకు ఈ సీజన్ లో సరపడా యూరియాను పంపిణీ చేయాలని లేనియెడల ఈ ప్రభుత్వాలు రైతాంగం చేత చిత్కారాలకు గురవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు దేశాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.