బతుకమ్మ, ముప్కాల్ : జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఒక్కరోజు కబడ్డీ టోర్నమెంట్ ను బుధవారం ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.గంగాధర్ రెడ్డి తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణ క్రీడా ప్రాంగణంలో అండర్-16 బాలుర 55 కిలోల విభాగంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు చేపట్టారు. మొత్తంగా 14 జట్లు తలపడగా విజేతగా సిర్నపల్లి జట్టు, రన్నర్ గా కిసాన్ నగర్ జట్లు నిలిచినట్లు క్రీడా నిర్వాహకులు పేర్కొన్నారు. విజేతలకు కబడ్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.గంగాధర్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. పాల్గొన్న క్రీడాకారుల్లోంచి 40 మంది క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు కోచింగ్ క్యాంప్ ను ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు అంజయ్య, ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్, పీఈటీలు అనిల్, సంజీవ్, ప్రేమ్, గంగా మోహన్, అరవింద్, యాదగిరి,సాయిలు, హరీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.