Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 5:29 pm Posted by : ramakrishna

వందేమాతరం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలి

 

. . . ప్రజలను ఐక్యంగా నిలబెట్టిన జాతీయ గేయం ప్రాధాన్యత విద్యార్థులు తెలుసుకోవాలి

 

. . . హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర పోరాటానికి వందేమాతరం స్ఫూర్తినిచ్చింది

 

. . . తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ టి యాదగిరి రావు పిలుపు

 

. . . వందేమాత‌రం ఫోటో ఎగ్జిబిష‌న్ ప్రారంభించిన వీసీ

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

స్వాతంత్య్ర‌ ఉద్య‌మ శంఖారావం వందేమాతరం గేయానికి 150 ఏళ్ల నిండిన సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు భార‌త రాజ్యంగ ర‌చ‌న ఘ‌ట్టాల‌ను తెలియజేసేలా కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ టి యాదగిరి రావు గురువారం ప్రారంభించారు. విశ్వవిద్యాలయం ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మూడురోజుల ఎగ్జిబిషన్ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రై ప్రారంభించిన అనంత‌రం సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శివచరణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదని, అది భారత స్వాతంత్య్ర‌ పోరాటానికి ప్రాణం పోసిన త్యాగస్ఫూర్తి, దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. వందేమాతరం నినాదం భారతీయుల ఆత్మగౌరవానికి, స్వాతంత్య్ర ఉద్య‌మంలో వారి తపన-త్యాగాలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. సుమారు 150 సంవత్సరాల క్రితం మహాకవి బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం భారతమాత ఔన్నత్యం, ఆధ్యాత్మిక వైభవం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

 

Students should move forward with the spirit of Vande Mataram
Students should move forward with the spirit of Vande Mataram
Students should move forward with the spirit of Vande Mataram

బ్రిటిష్ పాలకుల “విభజించి పాలించు” విధానానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసిన శక్తి వందేమాతరమేనని, కులం, మతం, ప్రాంత భేదాలు మరిచి “దేశమే ప్రథమం” అన్న భావనను పెంపొందించిందని ఆయనన్నారు. హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్య్ర పోరాటానికి వందే మాతరం స్ఫూర్తిని రగిలించిందని చెప్పారు. ఎంతో మంది విద్యార్థులు స్వాతంత్ర్య పోరాటంలో రావడానికి గేయం దోహదం చేసిందని, 1938లో నాటి హైదరాబాద్ సంస్థానంలో ప్రారంభమైన వందేమాతర ఉద్యమాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఆనాటి త్యాగాలను నేటి తరానికి తెలిసేలా ఎగ్జిబిషన్ ఉందని పేర్కొన్నారు. నేటి త‌రం వందేమాతరం 150వ ఉత్స‌వాల‌ను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు. సీబీసీ సహాయ సంచాలకులు కోటేశ్వర రావు మాట్లాడుతూ నేటి తరానికి వందే మాతరం, రాజ్యాంగ నేపథ్యం తెలియచేసి దేశ భక్తి పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థినులు, యువ‌తులు విద్య‌, కెరీర్‌పై దృష్టి సారించి విజ‌యం సాధించాల‌ని విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ అపర్ణ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వ‌హించిన వ్యాస‌ర‌చ‌న‌ పోటీలలో విజేత‌ల‌కు  బ‌హుమ‌తులు, స‌ర్టిఫికెట్లు అంద‌జేశారు. జాతీయ స్థాయిలో వందేమాతరంపై పోటీలలో మొదటి బహుమతి పొందిన విద్యార్థి సోహైల్ ఖాన్ ను సన్మానించారు. వందేమాతరం 150 ఏళ్ల సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు రాజ్యాంగ నిర్మాణ విశేషాల‌తో క‌డిన ఈ ప్రత్యేక ప్రదర్శన జ‌న‌వరి 29 నుంచి 31 వ‌ర‌కు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాంబాబు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆరతి, ఎన్ ఎస్ ఎస్ అధికారులు డాక్టర్ స్వామి రావు, డాక్టర్ స్రవంతి, డాక్టర్ స్వప్న, డాక్టర్ అలిమ్ ఖాన్, వివిధ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

Students should move forward with the spirit of Vande Mataram
Students should move forward with the spirit of Vande Mataram