నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లాలోని తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులందరూ మండల కేంద్రంలో ప్రతిభ పాట పోటీలను నిర్వహించడానికి విద్యార్థులను సన్నద్ధం చేసి మండల కేంద్రానికి తీసుకుని వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు జమీలుల్లా అన్నారు. కేర్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ కార్యవర్గ సమావేశంలో మండల, జిల్లాస్థాయిలో తెలుగు,హిందీ, ఉర్దూ భాషలలో ప్రతిభ పాటవ పోటీలను ప్రతి సంవత్సరం సంఘం తరఫునుండి నిర్వహించాలని తీర్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొదట మండల స్థాయిలో ఫిబ్రవరి 2,3 వ తేదీలలో ప్రతి పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థుల చొప్పున తెలుగు, హిందీ, ఉర్దూ భాషలకు ప్రతిభ పాటవ పోటీలలో పాల్గొనాలని, ఈ పోటీలను మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోనే నిర్వహించాలని తెలిపారు. ఈ పరీక్ష మొత్తం 20 ప్రశ్నలు బిట్ పేపర్ రూపంలో ఇవ్వబడతాయని, వాటికి 20 మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. మండలంలో మొదటి స్థానం, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి ద్వారా ప్రశంసా పత్రం అందించి సన్మానించాలని కోరారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం, రెండవ స్థానంలో విద్యార్థులందరికీ జిల్లాస్థాయిలో పోటీలను నిర్వహించి, జిల్లాలో ప్రథమ స్థానం, రెండవ స్థానం నిలిచిన విద్యార్థులకు అధికారుల చేత సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే జిల్లాస్థాయిలో నిర్వహించే ప్రతిభ పాట పోటీల తేదీలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె.వి.రమణాచారి, మహిళా అధ్యక్షురాలు శివ నాగమణి, రాష్ట్ర బాధ్యులు శాలి అరుణోదయ, గంట్యాల ప్రసాద్, కోశాధికారి సతీష్ వ్యాస్, జిల్లా ఉపాధ్యక్షులు బి ప్రవీణ్ కుమార్, శ్రీమన్నారాయణ చారి, ఏ.శ్రీనివాస్, పెంట శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.