. . . జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రతి అధ్యాపకుడు విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తూ, వారిని భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ శిక్షణా తరగతులు వారి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. రెండో స్పెల్‌లో కామర్స్, ఫిజిక్స్, హిస్టరీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన రెండు రోజుల ఓరియంటేషన్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంధం బుద్ధిరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ అధ్యాపకులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యాబోధన చేయాలని సూచించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొన్న పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ రెండు రోజుల ఓరియంటేషన్ తరగతులు తమ బోధనా నైపుణ్యాలను, వృత్తిపరమైన సామర్థ్యాన్ని మరింత పెంపొందించాయని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్స్ కామర్స్ లో నారాయణ, శ్రీనివాస్, ఫిజిక్స్ లో ఫణికుమార్, నాగేశ్వరయ్య, జువాలజీలో సుభాష్, శ్రీనివాస్, హిస్టరీలో రవికుమార్, దేవన్న అధ్యాపకులకు వివిధ బోధనా మెళకువలు, ఆధునిక పద్ధతులపై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్, నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు చిన్నయ్య, అబ్జర్వర్ ధర్మపాల్, జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
