నిజాంసాగర్, బతుకమ్మ : నిజాం సాగర్ మండలంలోని జవహర్ నవోదయ పాఠశాలలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలతో ఇటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల విద్యార్థినులపై వేధింపులపై పోక్సో చట్టం కేసులు నమోదు కావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు గల జవహర్ నవోదయ పాఠశాల పేరు కొందరు కీచక ఉపాధ్యాయుల వల్ల చెడ్డ పేరు వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై జవహర్ నవోదయ వైస్ ప్రిన్సిపల్ మనుజే యోహానన్ ను వివరణ కోరగా వేధింపు విషయాలపై మాట్లాడుతూ వేధింపుల విషయం వాస్తవమేనని ఇట్టి విషయాన్ని రీజినల్ ఆఫీసుకు, సంబంధిత అధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు. జవహర్ నవోదయ చైర్మన్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి నలుగురు ఉపాధ్యాయు లపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలోని విద్యార్థుల వ్యక్తిగత భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు.