Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 December 2024, 4:11 pm Posted by : ramakrishna

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

. పెద్ద కొడప్ గల్ ఎస్సీ బాలుర హాస్టల్ లో నలుగురు విద్యార్థులకు అస్వస్థత

. ఇద్దరిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలింపు

. వార్డెన్ ను బదిలీ చేసి చేతులు దులుపుకున్న అధికారులు

కామారెడ్డి, బతుకమ్మ: సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పెద్ద కొడప్ గల్ ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు నలుగురు గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అంబులెన్స్ లో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉడకని అన్నం, నాణ్యతలేని భోజనం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురికాగా అధికారులు మాత్రం వార్డెన్ ను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు.

ఉడకని అన్నం

ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ప్రతిపక్షాలు గురుకుల పాఠశాలల బాట పట్టినప్పటికీ  పరిస్థితిలో మారుప రావడం లేదనేందుకు ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. వార్డెన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా సంబంధిత శాఖ అధికారులు వార్డెన్ ను వేరే హాస్టల్ కు బదిలీ చేసి వదిలేశారు. హాస్టల్‌లో గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత 8వ తరగతి విద్యార్థులు బహదుర్‌సింగ్‌, జగన్‌తోపాటు మరో ఇద్దరికి  తీవ్ర కడుపునొప్పి వచ్చింది. బహదూర్ సింగ్, జగన్ ను అంబులెన్స్ లో  బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్టల్‌లో ఉడకని అన్నం తినడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. హాస్టల్‌లో ప్రస్తుతం 98 మంది విద్యార్థులు ఉంటున్నారు. గురువారం ఉదయం ఉడకని అన్నం పెట్టడంతో విద్యార్థులు తినకుండానే స్కూల్‌కు వెళ్లిపోయారు. తిరిగి రాత్రి కూడా ఉడకని అన్నం పెట్టారు.

హడావుడికే పరిమితం..

హాస్టళ్లలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో కూరలు వండకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహల్లో, గురుకుల పాఠశాల్లో చదివే విద్యార్థులకు లక్షల రూపాయలు నెలకు ఖర్చు చేస్తోందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదేనా విద్యార్థులకు అందించే లక్ష రూపాయల భోజనం అంటూ విద్యార్థుల సంఘాల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సంఘటన జరగగానే ప్రభుత్వం, అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు. దీంతో తమ పిల్లల భవిష్యత్ పై తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.