Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 6:11 pm Posted by : ramakrishna

బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని మృతి

 

. . . శ్రావణి కుటుంబానికి న్యాయం కోరుతూ అఖిలపక్ష ధర్నా

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీసీ బాలికల వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థిని శ్రావణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన ఈ ధర్నాలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ హాస్టల్‌లో భద్రతా లోపాలు ఉన్నాయని, పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థినుల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. శ్రావణి కుటుంబానికి తక్షణమే భారీ ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని అఖిలపక్ష నాయకులు, ప్రజలు డిమాండ్ చేశారు. శ్రావణి కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందకపోవడంతో వారు ప్రజల సహాయంపై ఆధారపడుతున్నారన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి సహాయం చేయడం లేదని, అందుకే మేము చందాలు సేకరిస్తున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.