నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కామ్రేడ్ జార్జిరెడ్డి వర్ధంతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పి.డి.ఎస్.యు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో క్రొవ్వోతుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఈబీ సెక్రటరీ సీతయ్య, పీడీఎస్క్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, పీడీఎస్యూ మాజీ నాయకులు కోనేరు సాయిలు మాట్లాడుతూ మన కాలపు వీరులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి, కామ్రేడ్ జార్జిరెడ్డి వర్ధంతి ఏప్రిల్ 14నే కావడం విశేషమన్నారు. కామ్రేడ్ జార్జిరెడ్డి జీనా హైతో మర్నా సీఖో, కదం కదం ఫర్ లడ్నా సీఖో అనే రణనినాదాన్ని విద్యార్థి లోకానికి అందించి, విద్యార్థుల్లో చైతన్య జ్వాలలు రగిలించాడని గుర్తుచేశారు. విద్యార్థుల హక్కులు, శాస్త్రీయ విద్యాసాధన, సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడినారన్నారు. కామ్రేడ్ జార్జిరెడ్డి విద్యార్థుల్లో ప్రగతిశీల భావాలు పెంపొందిస్తూ ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, ఏబీవీపీ లాంటి మతోన్మాద శక్తులకు సింహాస్వప్నం అయ్యాడన్నారు. 1972 ఏప్రిల్ 14న మతోన్మాద గుండాలు కుట్రచేసి కామ్రేడ్ జార్జిరెడ్డిని హత్య చేశారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితాంతం స్త్రీలపై దళితులపై మైనారిటీలపై వెనుకబడిన తరగతుల ప్రజలపై జరుగుతున్న వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడాడన్నారు. కుల నిర్మూలన కొరకు కులాంతర వివాహాలు విరివిగా జరగాలని, ప్రభుత్వాలు కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని కోరాడన్నారు. బీజేపీ ప్రభుత్వం సమాజంలో పెంచి పోషిస్తున్న అసమానతలకు వ్యతిరేకంగా, పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెడుతున్న అశాస్త్రీయ, మూఢత్వ, మతోన్మాద భావజాలాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులంతా అంబేద్కర్, జార్జిరెడ్డి ల స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు రజిత, సౌమ్య, వినోద్, నవీన్ లతో విద్యార్థులు పాల్గొన్నారు.
