- ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు జంతర్‌మంతర్‌లో ధర్నా
- ఢిల్లీ చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు
ఢిల్లీ, బతుకమ్మ: బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. జితనీ ఆబాదీ.. ఇతనీ హిస్సేదారి (ఎంత జనాభాకు అంత వాటా) అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టువీడకుండా ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు- విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో జంతర్‌మంతర్‌లో బుధవారం ధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవెర్చే బాధ్యతను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన భుజాలకు ఎత్తుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (SEEEPC) చేపట్టి.. ఆ లెక్కల ఆధారంగా రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటికి ఆమోదముద్ర వేయించాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఉంది… రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు పలికిన బీజేపీ నాయకులు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా ముస్లింలను సాకుగా చూపి భావోద్వేగ రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జంతర్‌మంతర్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు… బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, వివిధ జిల్లాల నాయకులు ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు సంబంధించి జంతర్‌మంతర్‌తో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
- ధర్నాకు రాహుల్ గాంధీ..
బీసీ రిజర్వేషన్ల సాధనకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగే పోరుకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షాలు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీల నాయకులు హాజరై తమ సంఘీభావం తెలపనున్నారు.