. . . డిమాండ్ల సాధనకు టీవీఏఈ జేఏసీ సమ్మె నోటీసు
. . . కన్వర్షన్, ఏపీఎస్ఈబి రూల్స్ అమలు చేయాలని గళమెత్తిన కార్మికులు
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం (టీవీఏఈ, జేఏసీ) తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా స్థాయి సమావేశం సోమవారం ఎల్లారెడ్డి డివిజన్‌లో నిర్వహించారు. సమావేశంలో ఆర్టిసన్ కార్మికులకు కన్వర్షన్ అమలు చేయడం, (ఏపీఎస్ఈబి) ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ నిబంధనలు వర్తింపజేయడం, (టీజీ ఎన్పీడీసీఎల్) తెలంగాణ నార్త్ర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో పని చేస్తున్న అన్‌మ్యాండ్ కార్మికులను (టీజీఎస్పీడీసీఎల్) తెలంగాణ స్టేట్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తరహాలో ఆర్టిసన్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై సమ్మె నోటీసు జారీ చేసినట్లు నాయకులు తెలిపారు. కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో టీజీఎన్పీడీసీఎల్ కంపెనీ కన్వీనర్ హెచ్.శ్రీకాంత్, కామారెడ్డి జిల్లా చైర్మన్ బి. హరికృష్ణ, కో-చైర్మన్ భీంరాజ్, కో-కన్వీనర్ బి.నివార్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.కిష్టగౌడ్, జాయింట్ సెక్రటరీ ఏ.రాఘవచారి, ఎల్లారెడ్డి డివిజన్ చైర్మన్ టి.రాజేందర్, కన్వీనర్ యం.రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.