Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 7:16 pm Posted by : ramakrishna

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై గట్టి నిఘా

  • ‘ డోపమ్స్’ పోర్టల్ ద్వారా డ్రగ్ పెడ్లర్స్, ఇతర అనుమానితుల గుర్తింపు
  • జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్, సీపీ

 

నిజామాబాద్, బతుకమ్మ : మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా ఉంచామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, ఇకముందు అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. గడిచిన రెండు మాసాలలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. అవసరమైతే మాదకద్రవ్యాల విక్రేతలు, రవాణ చేసే వారిపై పీ.డీ యాక్టును ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలను చైతన్యపరచేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రహరీ క్లబ్స్, యాంటీ డ్రగ్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో అవి పని చేసేలా చూడాలన్నారు. కొంతమంది గర్భిణీ మహిళలు సైతం క్లోరోఫాం, డైజోఫాం, అల్ఫ్రాజోలం వంటి హానికారకమైన పదార్థాలను వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కల్లు సేవిస్తున్నట్లు సమాచారం ఉందని, ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని అన్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకొని గర్భిణీ స్త్రీలు కల్తీ కల్లు బారిన పడకుండా గ్రామగ్రామాన అంగన్వాడి కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.

కాగా, ‘డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ ఎనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (డోపమ్)’ పోర్టల్ ద్వారా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా చేసే వారిని, వాటిని విక్రయిస్తున్న వారిని, వాటిని వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ గట్టి నిఘా కొనసాగిస్తున్నామని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య స్పష్టం చేశారు. ఈ పోర్టల్ సహాయంతో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని సీ.పీ సూచించారు. మత్తును కలుగజేసే ఔషధాలు పక్కదారి పట్టకుండా, వాటి వినియోగం పై కూడా పర్యవేక్షణ జరపాలని జిల్లా ఔషధ నియంత్రణ విభాగం అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరం లోపు సిగరెట్లు, గుట్కాలు వంటి విక్రయాలు జరుగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి, డీఈఓ అశోక్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్, ప్రాంతీయ రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల, డీటీఓ ఉమా మహేశ్వరరావు, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Strict vigilance on the transportation and use of narcotics, drugs