. . . ఏఐయుఎంఎస్ జిల్లా కన్వీనర్ లావణ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఏఐయుఎంఎస్ జిల్లా కన్వీనర్ లావణ్య ప్రభుత్వాలను కోరారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాందేవ్‌వాడ లోని ఆర్ ఎస్ పీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆల్ ఇండియా యునైటెడ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏఐయుఎంఎస్ జిల్లా కన్వీనర్ కటారి లావణ్య మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం చట్టాలు ఉన్నప్పటికీ వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. మహిళా సాధికారతకు సంబంధించి తీసుకొచ్చిన చట్టాలు, బిల్లులను సమర్థంగా అమలు చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళలకు ప్రత్యేక పథకాలు, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు.ఈరోజు మహిళలు నేల నుండి నింగి వరకు అన్ని రంగాలలో తమ ప్రతిభను నిరూపించు కుంటున్నారని, విద్య, రాజకీయాలు, విజ్ఞానం, క్రీడలు, పరిశ్రమలు, పరిపాలనతో పాటు వ్యవసాయ రంగంలో కూడా మహిళల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. సమాజంలో సమానత్వం నెలకొనాలంటే మహిళలకు గౌరవం, భద్రత సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.సమావేశం అనంతరం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ కేక్ కట్ చేసి మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు సవిత, సంగీత, బిందు, స్వరూప, సుప్రియ ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.
