. . . లోపాలు జరిగితే అధికారులే బాధ్యులు
. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
భీంగల్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్న రిటర్నింగ్ అధికారులు, పై అధికారులను సంప్రదించి సందేహలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. గురువారం జిల్లాలోని భీంగల్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ స్వీకరణ కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా, వార్డ్ ల వారికి ఎన్ని స్థానాలకు నామినేషన్లు దాఖలాయ్యాయి అనే విషయాన్ని పరిశీలించారు. నామినేషన్ పత్రాలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఆర్మూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో పలు లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల సమయంలో ఎన్నికల నియమావళిని తుచా తప్పకుండ పాటించాలన్నారు. నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులు నిర్ణీత సమయంలో వారి వారి బీ ఫామ్ లు సమర్పించాలని, లేనిపక్షంలో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయ, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్, భీంగల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, స్థానిక అధికారులు ఉన్నారు.
