Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 6:30 pm Posted by : ramakrishna

వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

 

. . . అదనపు కలెక్టర్ వి.భుజంగరావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం అన్ని సంక్షేమ శాఖల ప్రభుత్వ విద్యా సంస్థల అధికారులు, నిర్వాహకులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష జరిపారు. ఇటీవల పలు హాస్టళ్ళు, గురుకులాలను క్షేత్రస్థాయిలో సందర్శించిన సమయంలో నిర్వహణపరమైన లోపాలు తన దృష్టికి వచ్చాయని, తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థిని, విద్యార్థులకు డైట్ సమకూర్చాలని సూచించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు నాణ్యమైన, తాజా కూరగాయలు, పండ్లు, మాంసాహారం సరఫరా చేసేలా నిశిత పర్యవేక్షణ జరపాలని, ఒకవేళ ఎవరైనా నాసిరకం వస్తువులు, చికెన్, మటన్ వంటివి సరఫరా చేస్తే వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో అలసత్వం వహిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిబంధనలు పాటించని కాంట్రాక్టు ఏజెన్సీని రద్దు చేసి, కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, సానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హాస్టళ్ళు, గురుకులాల నిర్వాహకులకు హితవు పలికారు. మండల ప్రత్యేక అధికారులు, ఆర్.సీ.ఓ లు క్రమం తప్పకుండా విద్యా సంస్థలను సందర్శిస్తూ, నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డీ.ఈ.ఓ అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Strict action will be taken for negligence in the management of hostels.