Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 8:29 pm Posted by : ramakrishna

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

 

. . . విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలి

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో పాటు ఎరువులు విత్తనాల డీలర్లతో, రైస్ మిల్లర్లతో కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

 

Strict action will be taken against those who sell fake seeds and fertilizers.

 

అయితే నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా మార్కెట్లో చెలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్దీకరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనే పదం వినిపించకూడదని, ఈ విషయంలో  అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని అన్నారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఎవరైనా నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని, కేసులు నమోదు చేసి రికవరీ యాక్టు అమలు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. డీలర్లను ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం కాదని, ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకూడదు అన్న సంకల్పంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తనిఖీకి వచ్చే అధికారులకు సహకరించాలని డీలర్లకు సూచించారు. జిల్లాకు వ్యవసాయ రంగంలో మంచి పేరు ఉందని, దానిని నిలుపుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని అన్నారు. క్షేత్రస్థాయిలో ఎరువులు విత్తనాల దుకాణాలలో తనిఖీలు నిర్వహించిన వివరాలను నివేదిక రూపంలో తనకు ఎప్పటికప్పుడు సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. క్రాప్ బుకింగ్ ఫార్మర్ రిజిస్ట్రీ విషయంలోనూ ఖచ్చితత్వంతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. లేనిపక్షంలో పంట సేకరణ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యవసాయ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.  అవగాహన సదస్సులో  జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Strict action will be taken against those who sell fake seeds and fertilizers.