. . . గోపాల్ బాగ్ శివాలయంలో విగ్రహల ధ్వంసం
. . . పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
హిందూ ఆలయాలు, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని, ఈ ఘటనపై పోలీసులు వెంటనే నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలో గల గోపాల్ బాగ్ పురాతన శివాలయంలో జరిగిన దేవతా విగ్రహాల ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయనన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పురాతన శివాలయంలోని విగ్రహలను ధ్వంసం చేసిన విషయం తెలిసిన అర్బన్ ఎమ్మెల్యే మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఈ సంధర్బంగా ఘటన తీరును స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయానికి చెందిన సుమారు 80 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకొని, ఆలయ భూములను రక్షించాలని అధికారులను కోరుతున్నానని తెలిపారు. ఇలాంటి ఘటనలు కొనసాగితే హిందువుల ఆగ్రహం పెరుగుతుందని, అప్పుడు జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ హిందూ ఆలయాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. హిందూ ఆలయాలు, హిందూ దేవతా విగ్రహాలపై దాడులు జరగడాన్ని హిందువులందరూ గమనిస్తున్నారని, ఒక్కసారి కాషాయ దళం రెచ్చిపోతే జరిగే నష్టానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని, వారితో పాటు లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. గోపాల్ బాగ్ లో పురాతన శివాలయం పై గత మూడు రోజుల క్రితం జరిగిన ఈ విగ్రహాల ధ్వంసం ఘటనపై పోలీసులు కనీసం నిందితులను పట్టుకోవడంలో వైఫల్యం చెందారని అన్నారు. ఈ 80 ఎకరాల గోశాల స్థలంలో కొందరు ముస్లింలు కబ్జాలకు కూడా పాల్పడ్డారని దీనిపై వెంటనే కలెక్టర్, రెవిన్యూ సిబ్బంది స్పందించి ఈ కబ్జాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ శివాలయం పక్కనే గల గోశాలలో 150 ఆవులు ఉన్నాయని, దేవతా విగ్రహాలకే భద్రత లేని ఈ పరిస్థితుల్లో గోమాతలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక హిందూ ఆలయాలపై, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెట్రేగిపోతున్నాయని విమర్శించారు. అలాగే హిందూ అమ్మాయిలపై లవ్ జిహాద్ పేరిట జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మిగతా మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమది సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ వారు అంటూ ఉంటారని సెక్యులర్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సెక్యులర్ పార్టీ అంటే బిజెపి పార్టీ అని, మా పార్టీ కేవలం ఒక హిందువులే కాకుండా దేశంలో ఉన్న అన్ని మతస్తులతో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తుందని అన్నారు.
