హైదరాబాద్, బతుకమ్మ :
ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 24న జరగనున్న విద్యాసంస్థల బంద్‌కు పీడీఎస్‌ఎఫ్, డీఎస్‌ఎఫ్‌ఐ, బీడీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాల్‌రాజ్, డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కోశాధికారి సూర్యప్రకాశ్ మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులు, యువత నిర్వహించిన నిరసన ర్యాలీపై టియర్ గ్యాస్, లాఠీచార్జ్ వంటి చర్యలు చేపట్టి వారిపై దాడి చేయడం అమానుషమని వారు విమర్శించారు. విద్యార్థులు, యువతపై జరిగిన దాడులను ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్‌కు తమ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నాయకులు, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో దోషులను తక్షణమే శిక్షించాలని, విద్యారంగానికి తగిన నిధులు కేటాయించాలని, విద్యలో కార్పొరేటీకరణ, వ్యాపారీకరణను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులపై దాడులను వెంటనే నిలిపివేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకుడు సాయి కుమార్, డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.