Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 3:08 pm Posted by : ramakrishna

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి

 

. . .  విజిలెన్స్ బృందాలతో నిరంతరం తనిఖీలు, దాడులు

. . .  శాఖలో నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలి

. . .  రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి

. . . గనులు  భూగర్భ వనరుల శాఖపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్, బతుకమ్మ :

రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ తవ్వకాలు, అనధికారికంగా ఖనిజాల తరలింపును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ సోమవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ పనితీరు, పరిపాలనా అంశాలు, ఆదాయ సమీకరణ, సిబ్బంది నియామకాలు, పదోన్నతులు తదితర అంశాలపై సీఎస్ సమగ్రంగా సమీక్షించారు. శాఖ పరిధిలోని ఖనిజ వనరుల సమర్థవంతమైన వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియలను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని సూచించారు. సిబ్బంది కొరత కారణంగా శాఖ కార్యకలాపాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు, దాడులు చేపట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా, అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా గనులు, భూగర్భ వనరుల శాఖను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా సమన్వయంతో పనిచేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో  మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌ మెంట్)డి.ఎస్. చౌహాన్, ఐటీఈ సీ సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ మైన్స్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.