- నిలిచిన దానిపై తలోమాట
- సీఎండీ ఆదేశాలిస్తే జాబితా : ఎస్ ఈ
నిజామాబాద్, బతుకమ్మ : గంట, గంటకు ఉత్కంఠ రేపుతూ చివరికి బదిలీల జాబితా ప్రకటనను వాయిదా వేశారు. సెప్టెంబర్ 27 న వచ్చిన బదిలీల దానిపై కసరత్తు మొత్తం పూర్తయింది. ఏడవ తేదీన సాయంత్రం ఐదు లోపు జాబితాను వెలువరిస్తారని ముందుగానే ప్రకటించడంతో ఉద్యోగులు ఆయా కంపౌండ్ లోకి చేరుకున్నారు. ఇప్పుడు,అప్పుడు అంటూ సోమవారం అర్ధరాత్రి వరకు పచార్లు కొట్టారు. బోధన్ డివిజన్ లో ఓ అండ్ ఎం (ఆపరేషన్, మెయిన్టెనెన్స్ )కు సంబందించిన వాటి జాబితాను అక్కడి డిఈ విడుదల చేసారు. ఇంతలోనే పై నుంచి పిడుగు పడినట్లుగా బదిలీల జాబితాను నిలిపివేయాలని సీఎండీ ఆదేశాలు జారీ చేసారు. జాబితాను వెలువరించిన దానిని సైతం తొలగించాలని ఆదేశించడంతో వెంటనే దానిని తీసివేశారు.
నెలకొన్న ఉత్కంఠ: అనుకున్న ప్రకారంగా జాబితాను ప్రకటిస్తారనుకున్న ఉద్యోగులకు ఎదురు చూపులు తప్పలేదు. ఎక్కడికి బదిలీ జరిగిందో తెలియక పోవడంతో జాబితాలో ఉన్నవారిలో
ఉత్కంఠ నెలకొంది. అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల పండగ ముందు హైరానా పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు.
బదిలీల ముందు పదోన్నతులు : త్వరలో పదోన్నతులు రానున్న దరిమిలా బదిలీలు చేయకూడదని సీఎండీ కి నాయకులు తెలపడంతో సోమవారం ప్రకటించాల్సిన జాబితాను ఆయన నిలిపివేయించారనే ప్రచారం జరుగుతోంది. పదోన్నతులు ఇవ్వాల్సివస్తే స్థానచలనం అయ్యాక సైతం ఇవ్వవచ్చు. అలాంటిది మధ్యంతరంగా వాటి పేర బదిలీలను నిలిపివేయించడం అవివేకమైన పనే అని కొంతమంది ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
బదిలీల కోసం ప్రకటన వెలువడగానే ఈ ప్రక్రియపైన సీఎండీని యూనియన్ నాయకులు కలిసి సమస్యను నివేదించాల్సి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తయారు చేసిన జాబితాపై పలు అనుమానాలు ఉండగా, అర్ధాంతరంగా నిలిపివేయడంతో దానికి మరింత బలం చేకూర్చినట్లవుతుందనే చర్చ జరుగుతోంది.
సీఎండీ చెప్తే : సీఎండీ నిర్ణయానుసారంగా బదిలీల జాబితాను ప్రకటించాలని చెప్తే, వెంటనే వెలువరించనున్నామని నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ రవీందర్ తెలిపారు.