Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 8:27 pm Posted by : ramakrishna

ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ కల సాకారం దిశగా అడుగులు

 

. . . డిఫెన్స్‌ కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు

 

. . . ఎంపీ, ఎమ్మెల్యే, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

 

ఆదిలాబాద్, బతుకమ్మ :

 

ఆదిలాబాద్ జాయింట్ యూజర్ (డిఫెన్స్-సివిల్) ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో చేపడతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, బెంగళూరుకు చెందిన ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు, రాష్ట్ర సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన, మైక్రో లెవెల్ సర్వే నిర్వహించి, రన్‌వే విస్తరణతో పాటు సాంకేతిక అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చర్యలను వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, అదనంగా డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎయిర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్) కోసం 1,500 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలను కేటాయించేందుకు ప్రాథమిక ఆమోదం లభించిందని వివరించారు. జియో కో ఆర్డినేట్ల ఆధారంగా భూసేకరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేసిన కలెక్టర్, సీఎంఓ కార్యాలయం, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీకి భూములను అప్పగిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు సివిల్ ఏవియేషన్‌తో పాటు డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావడం ప్రజలకు ఒక చారిత్రాత్మక అవకాశమని పేర్కొన్నారు.

 

Steps towards realizing the dream of an airport for Adilabad.

 

ఢిల్లీ స్థాయిలో ఇప్పటికే చర్చలు : ఎంపీ గోడం నగేష్

ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన లొకేషన్ల పరిశీలన విజయవంతంగా పూర్తయిందని ఎంపీ గోడం నగేష్ తెలిపారు. గత మార్చిలో ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డిలతో ఈ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించామని, మే 15న కేంద్ర ఉన్నతస్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన కూడా నిర్వహించిందని గుర్తుచేశారు. రక్షణ శాఖ కోరిన 1,500 ఎకరాల భూమి సేకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లా అధికారులతో కలిసి మ్యాప్‌ల ఆధారంగా మైక్రో లెవెల్ సమీక్ష నిర్వహించామని, ప్రాజెక్టు వేగవంతానికి నేటి సమావేశం కీలక ముందడుగు అని పేర్కొన్నారు.

దశాబ్దాల కల నెరవేరబోతోంది: ఎమ్మెల్యే పాయల శంకర్

జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై నేటి సమావేశంతో స్పష్టత వచ్చిందని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి మొత్తం 1,840 ఎకరాలు అవసరమవుతాయని, ఇందులో 1,500 ఎకరాలను రక్షణ శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు. ఇప్పటికే 360 ఎకరాలు రక్షణ శాఖ పరిధిలో ఉండగా, రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలను సేకరించాల్సి ఉందన్నారు. గతంలో జారీ చేసిన 700 ఎకరాల జీవో ప్రకారం పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 800 ఎకరాల అనుమతుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. తదుపరి విధానపరమైన నిర్ణయాల కోసం త్వరలో ఎంపీ నేతృత్వంలో ఢిల్లీలో ఉమ్మడి సమావేశం జరగనుందని, ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుతో ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబో తోందని, జిల్లా అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, ఎస్. రాజేశ్వర్, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు జేపీ సబర్వాల్, ఎస్.జి. హెడ్గే, ఎస్.కె. రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్, ల్యాండ్ సర్వే ఏడీ ప్రభాకర్, తహశీల్దార్లు శ్రీనివాస్, గోవింద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Steps towards realizing the dream of an airport for Adilabad.