13 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ అందిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యయుడు సాగర్.
నందిపేట్, బతుకమ్మ : నందిపేట, తల్వేద ప్రాంతాల్లో ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. గత 13 సంవత్సరాలుగా విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకుండా శిక్షణ అందిస్తున్న లక్కంపల్లి సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనం పథకం కింద 8వ తరగతి విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయడానికి కావాల్సిన మెలుకువలను నేర్చుకోవడానికి ఈ శిక్షణ సహాయపడుతుంది.
ఎన్ఎంఎంఎస్ పథకం ప్రాముఖ్యత..
కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంతో రూపొందించిన ఎన్ఎంఎంఎస్ పథకం ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించడం ద్వారా వారి విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. 8వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు వార్షిక సాయం పొందగలుగుతారు. ఇది పేద కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక సహాయంతోపాటు వారి విద్యాభ్యాసంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రేరణగా నిలుస్తుందని శిక్షణ అందిస్తున్న ఉపాధ్యాయుడు సాగర్ అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులు..
ఈ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవంలో నందిపేట జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయురాలు ఎం. మంజుల, తల్వేద జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు మోహన్ పాల్గొన్నారు. వారు విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థులకు విజ్ఞప్తి..
విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని NMMS స్కాలర్‌షిప్ పరీక్షలో సత్ఫలితాలు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయుడు సాగర్ ఔదర్యానికి ప్రశంసలు..
గత 15 సంవత్సరాలుగా ఎటువంటి ఫీజులు లేకుండా విద్యార్థులకు శిక్షణ అందిస్తూ, విద్యా సహాయంగా నిలిచిన లక్కంపల్లి సాగర్ సేవలను పలువురు ప్రశంసించారు. NMMS పరీక్ష కోసం ఉచిత శిక్షణ అందించడం ద్వారా పేద కుటుంబాల విద్యార్థులకు సమర్థవంతమైన పునాది వేస్తూ, సామాజిక సేవలో నూతన ఒరవడి ఏర్పరిచారు.