.. పనిష్మెంట్ కింద ఇద్దరు గెజిటెడ్ హెడ్మాస్టర్ ల పొరుగు జిల్లాకు బదిలీ
. . . నిర్మల్ జిల్లాలో విధులలో చేరిన హెచ్ఎం లు
. . . మరో ఐదుగురు ఉపాధ్యాయుల రిమూవల్ ఆఫ్ సర్వీసెస్ కు అవకాశం
నిజామాబాద్, బతుకమ్మ:
పధవ తరగతి పరీక్ష పత్రాలు లీక్ తో సంబంధం ఉండి సస్పెండ్ చేయబడిన ఇద్దరు గేజిటెడ్ హెడ్మాస్టర్ లు తిరిగి విధుల్లో చేరారు. వారిద్దరికి పనిష్మెంట్ కింద బాసర జోన్ పరిధిలోని నిర్మల్ జిల్లా లో పోస్టింగ్ ఇవ్వగా శుక్రవారం వారిద్దరు విధులలో చేరినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో భాగంగా ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. వాట్సప్ లో ప్రశ్న పత్రాలు బయటకు రావడాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా అనాడు 9 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై వేటు వేశారు. అందులో బోధన్ లో ఒక సెంటర్ లో విధులు నిర్వహించిన ఇద్దరి ప్రమేయం లేదని జిల్లా విద్యాశాఖాధికారి విచారణ తేలడంతో వారిపై సస్పెన్షన్ వేటు ఎత్తి వేశారు. మిగిలిన ఏడుగురు ఉపాధ్యాయులపై పోలీస్ శాఖ క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో వారిపై సస్పెన్షన్ ను కొనసాగించారు. అందులో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు ఐనా మమత, రాజేందర్ లకు నిర్మల్ జిల్లాకు బదిలీ చేశారు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు. శాఖ పరమైన చర్యలు ఇంకా పెండింగ్ లో ఉండగా శుక్రవారం వారిద్దరు నిర్మల్ జిల్లాలో విధులలో చేరినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరో ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయుల పై కఠిన చర్యలు ఉంటాయని తెలిసింది. వారిని రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేసే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్రిమినల్ కేసులు ఉండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల పై కఠిన చర్యలు తప్పవని సమాచారం.