మోపాల్, బతుకమ్మ :
మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి లో గల ఇందూర్ తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం కళ్యాణ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానని మంత్రి అన్నారు.

ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా తత్పరత తో, సమాజ సేవ దృక్పథంతో, సమాజానికి జ్ఞానం అందించాలనే గొప్ప ఆలోచనతో ఈ ఆలయాన్ని శ్రీమాన్ నర్సింహారెడ్డి కట్టించడం చాలా గొప్ప విషయమని మంత్రి అన్నారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని తెలిపారు. తిరుమల తిరుపతికి వెళ్లలేని వారు ఇందూరు తిరుమలలో ఆ భక్తిని, శక్తిని దక్కించు కోగలుగుతున్నారని అన్నారు. స్వామి వారి కల్యాణంలో పాల్గొంటే కన్యాదాన ఫలం వస్తుందని దేవనాథ జీయర్ స్వామి వారు అన్నారు. ఉదయం యజ్ఞ కార్యక్రమం ముగిసిన తరువాత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పరిసరాలు భక్తులతో నిండిపోయింది. ఈ కార్యక్రమాల్లో దేవనాథ జీయరు స్వామి, ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ రెడ్డి, ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి, సినీ హీరో ఆశిష్, విజయసింహ రెడ్డి, రాములు, ప్రవీణ్, పృథ్వి, నరాల సుధాకర్, నర్సారెడ్డి, రాజేశ్వర్, రమేష్, భాస్కర్, నరేందర్, మురళి, యాజ్ఞాచార్యులు అనంత ఆచార్య, సంపత్ కుమార్ ఆచార్య, రోహిత్ కుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

. . . మంత్రి కొండా సురేఖ కి ఘన స్వాగతం
అటవీ శాఖ పర్యావరణ ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కి నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నిజామాబాద్ నగర మేయర్ ఉమా రాణి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ నగర మేయర్ ఆకుల సుజాత, ఏఐసీసీ కోఆర్డినేటర్ కప్‌కర్ గన్‌రాజ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్ పాల్గొన్నారు.