Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2025, 4:26 pm Posted by : ramakrishna

శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి వజ్రోత్సవ వేడుకలు

  • తొమ్మిది రోజుల పాటు గ్రామంలో పండుగ వాతావరణం

 

రుద్రూర్, బతుకమ్మ:  జిల్లాలో ఎక్కడా లేని విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రుద్రూర్ లో జరిగే నవరాత్రి ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నిర్వహించే ఉత్సవాలకు జిల్లా నలుమూలాల నుంచి భక్తులు తరలివస్తారంటే ఎంతంటి ప్రత్యేకత ఉందో అర్ధం చేసుకో వచ్చు. 75 ఏళ్లుగా రుద్రూర్ సార్వజనిక్ గణేష్ మండలి ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం వజ్రోత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఘనమైన ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజుల పాటు గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడనుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సవాలలో పాల్గొని సందడి చేస్తుంటారు. 1950లో కాశీనాథ్ అప్ప, దశ హన్మాండ్లు, మోత్కురి నడ్చి గంగారాంలు శ్రావణ మాసంలో దశమి రోజున గ్రామంలోని తమ్మలి గంగారాం ఇంటి వద్ద గణనాథుడిని ఉంచేవారు. చవితి రోజున అక్కడి నుండి విఠలేశ్వర మందిరానికి తీసుకెళ్లి ప్రతిష్టించేవారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఉత్సవాలలో భాగంగా సత్య హరిచంద్ర నాటకాలు నిర్వహించారు. ఆర్కెస్ట్రా వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగేవి. అప్పట్లోనే భక్తుల్లో ఈ కార్యక్రమాలతో జోష్ నింపారు. తర్వాత స్థానిక పెద్ద చెరువులో గణనాథుడిని నిమజ్జనం చేసేవారు. ఇలా గత 75 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఈ సారి ప్రతిష్టించే గణనాథుని కొనుగోలుకు 80 మంది దాతలు ముందుకు వచ్చారు.

  • ప్రతిరోజు హోమాలు, ప్రవచనాలు, అన్నదాన కార్యక్రమాలు..

రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రోత్సవ  కార్యక్రమంలో భాగంగా గణేష్ మండలి వద్ద ప్రతిరోజు  వేద పండితులచే ప్రవచనాలు, హోమాలు, భజనలు,  అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

  • నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల కోలాహలం

నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల కోలాహలం అధికంగా ఉంటుంది.  రుద్రూర్ మండలంతో పాటు వర్ని, బీర్కూర్, బోధన్, ఎడపల్లి, చందూర్, మోస్రా, పోతంగల్, తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుంచి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. గణనాథుడికి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు వినాయక నిమజ్జనానికి ముందు రాత్రి నుంచి ఉదయం వరకు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తుంటారు. జాతర సైతం నిర్వహించడం ఇక్కడ మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Sri Sarvajanik Ganesh Mandali Diamond Jubilee Celebrations