Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 February 2025, 2:43 pm Posted by : ramakrishna

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, బతుకమ్మ :  శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి  బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సింహ వాహనం ధైర్య సిద్ధి

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌స్వామి మూడో రోజు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ వాహ‌నాన్ని దర్శిస్తే సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యాపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. ఈవాహ‌న‌సేవ‌లో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్ ర‌మేష్‌, ఆలయ అర్చకులు బాలాజి రంగాచార్యులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.