Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 7:14 pm Posted by : ramakrishna

ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం

అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్

నిజామాబాద్, బతుకమ్మ: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి, ధర్పల్లి మండల కేంద్రంతో పాటు హోన్నాజీపేట్, సీతాయిపేట్, సిరికొండ, పెద్దవాల్గోట్, గడ్కోల్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా నెలకొల్పిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సోమవారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. కాంటా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియచేయాలని రైతులకు సూచించారు. కాగా, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట లారీలలో లోడ్ చేయించి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.