Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 8:08 pm Posted by : ramakrishna

వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు

 

జుక్కల్, బతుకమ్మ :

 

వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వర్షాధార పంటలపై ఆధారపడిన జుక్కల్ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణదేవుడి కరుణ కోసం రైతులు, గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపారులు కలిసి గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. జుక్కల్ మండలంలో వేలాది ఎకరాల్లో సాగు చేసిన పెసర, మినుము, కంది, పత్తి, సోయాబీన్ పంటలు వర్షాభావంతో పాటు తీవ్ర ఎండలు, ఈదురుగాలుల ప్రభావానికి గురై ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో గ్రామంలో భజనలు, కీర్తనలు చేస్తూ ఊరేగింపు నిర్వహించిన భక్తులు నిండు కడవలతో గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మంచి దిగుబడులు రావాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జుక్కల్‌లోని ప్రసిద్ధ మహాదేవుని ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.